మనుషులు - మనస్తత్వాలు: సానుకూల దృక్పథం - ఒక అందమైన ప్రయాణం

    జీవితం అంటే అనుబంధాల సంగమం. ప్రతి మనిషి మన జీవన ప్రవాహంలో ఒక అలలా వస్తాడు, కొందరు తీరాన్ని తడిపి వెళతారు, మరికొందరు లోతుల్లోకి తీసుకెళతారు. ప్రతి అనుభవం మనకు కొత్త పాఠం, ప్రతి సంబంధం మన పరిణతికి అద్దం.

    ఓ రోజు ఫోన్ లో ఎవరితోనో.. మాట్లాడుతుంటే.. వెనకాల మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల మాటలు నా చెవిన పడ్డాయి - అవి నా గురించే. కొంత సేపు అసౌకర్యం అనిపించినా, ఆ క్షణంలోనే నాకు ఒక విషయం స్పష్టమైంది - ప్రతి మనిషి తన స్వంత ప్రపంచంలో తన రంగుల్లో ఉంటాడు. మరుసటి రోజు వాళ్లు ఏమీ తెలియనట్లు నాతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం కంటే ఒక కొత్త దృష్టి కలిగింది - మనుషుల్లో మూడు ప్రకృతులుంటాయి: మానవీయం, దివ్యం, తామసం. తామస స్వభావం ఉన్నవారు ముందు ఒకలా, వెనక మరోలా ఉండటం వారి సహజం. కానీ అది వారి పరిమితి, మన బాధ్యత కాదు. ఆ పరిమితులను అర్థం చేసుకోవడమే మన విజ్ఞత.

    అలాంటి వారు ఎదురైనప్పుడు, వారిపట్ల కోపం కాదు, కరుణే మన ఆయుధం. వారిలో మార్పు రావాలని ఆశించడం మంచిదే, కానీ మన శాంతిని కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. అల్లంటి వారితో మెలిగేటప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని చిన్న జీవన సూత్రాలు ఈ ప్రయాణంలో మనకు తోడవుతాయి:

1. అందమైన హద్దులను గీసుకోవడం: కొత్త వారితో, సహోద్యోగులతో మెలిగేటప్పుడు మన వ్యక్తిగత సరిహద్దులను గౌరవంగా, స్పష్టంగా ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. అందరితో ఆప్యాయంగా, మర్యాదగా ఉంటూనే.. మన లోతైన మాటలను, భావాలను కేవలం విశ్వాసపాత్రులకే పరిమితం చేయడం మంచిది. కార్యాలయంలో వృత్తి ధర్మానికి కట్టుబడి, అక్కడికక్కడే పరిమితమైతే మనం మన సొంత స్థలాన్ని కాపాడుకున్నవారమవుతాం.

2. శాంతంగా మాట్లాడి - మనసు తెరచుకోవడం: స్నేహితుల మధ్య ఎప్పుడైనా వేరొకరి మాటల వల్ల గందరగోళం వస్తే, తటాలున భావోద్వేగానికి లొంగకుండా.. కాసేపు ఆగి, నిశ్శబ్దంగా ఆలోచించి, ఆపై నిజాయితీగా మాట్లాడాలి. నమ్మకమైన వ్యక్తులతో మనస్సు విప్పి, సున్నితంగా సంభాషిస్తే అపార్థాలు కరిగిపోతాయి, ఆత్మీయత మరింత లోతవుతుంది. నిజమైన స్నేహానికి స్పష్టమైన మాటలే వంతెన.

3. సానుకూలతతో నిండిన వాతావరణాన్ని ఎంచుకోవడం: ఇతరుల ప్రవర్తన మనల్ని కలచివేసినా, ఆ బాధను ఒడిలో పెట్టుకుని కూర్చోవడం మన జీవిత సమయాన్ని వృథా చేసుకోవడమే. బదులుగా, మనల్ని నిజంగా ప్రేమించే, మన శ్రేయస్సును కోరుకునే కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రులతో సమయాన్ని ఉల్లాసంగా గడపాలి. మన చుట్టూ ప్రేమ, ఆశ, స్ఫూర్తి నిండిన వాతావరణాన్ని సృష్టించుకోగలిగితే, అవసరం లేని నెగెటివిటీ స్వయంగా దూరమవుతుంది.

     జీవితంలో ఇలాంటి చేదు అనుభవాలు కూడా ఒక అమూల్య గుణపాఠం. అవి మనకు నేర్పేది, మనల్ని అర్థం చేసుకునేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, గిట్టని వారిని క్షమించి, వారి పట్ల తాపత్రయం లేకుండా మన దారిలో మనం ఆనందంగా ముందుకు సాగాలని. క్షమా గుణమే అతిపెద్ద ఆయుధం, సానుకూల దృక్పథమే మనకు సదా తోడు. నవ్వుతూ, నేర్చుకుంటూ, ఎదుగుతూ........ ఇదే కదా అందమైన జీవన శైలి, అందమైన జీవన ప్రయాణం.

- టి.మల్లికార్జున ప్రసాద్


 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.