ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు (30) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
విజయనగరం రింగురోడ్డు, గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడె గురు (30) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త సాములు వారం క్రితం భార్యను విశాఖ జిల్లా తగరపువలసలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడం.. చేతిలో డబ్బులు లేకపోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. సాలూరు వెళ్లి, అక్కడి నుంచి సొంతూరుకు మరో వాహనంలో వెళ్దామని ఆటో మాట్లాడుకున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం వంతెన వద్దకు చేరుకోగానే గురు మృతిచెందారు.
ఆటోచోదకుడు మృతదేహాన్ని అక్కడే దింపేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో తెలియక భార్య మృతదేహాన్ని సాములు భుజాన వేసుకొని బయలుదేరాడు. దారిలో ఎదురైనవారిని సాలూరు ఎటువైపని అడిగాడు. అతనికి తెలుగు రాకపోవడంతో అడిగేది ఎవరికీ అర్థం కాలేదు. తిరిగి నాలుగు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాడు. అటువైపు వెళ్లేవారు గమనించి గంట్యాడ పోలీసులకు తెలిపారు.
సీఐ టి.వి.తిరుపతిరావు, గంట్యాడ ఎస్సై కిరణ్‌కుమార్ రామవరం వద్దకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు భోజనం పెట్టించారు.
ప్రైవేటు అంబులెన్సు మాట్లాడి 125 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి పంపించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని పాచిపెంట సీఐ, ఎస్సైలకు సమాచారమిచ్చారు. బాధితుడి బంధువులకు తెలియజేయాలని, అవసరమైన సహకారం అందించాలని కోరారు. పోలీసుల మానవత్వాన్ని పలువురు హర్షించారు.
పోలీసులకు ధన్యవాదములు.
Courtesy: ఈనాడు దినపత్రిక.