తోటివారి మనోభావాలను గౌరవిద్దాం: ఒక రైల్వే స్టేషన్ అనుభవం

ఆ మధ్య ఒక రోజు, బహుశా ఉదయం నుంచీ నిలబడి క్లాస్ చెప్పడం వలన శారీరకంగా, మానసికంగా చాలా అలసటగా అనిపించింది. ఉదయం బయటనుంచి తెప్పించిన టిఫిన్ అస్సలు బాగోలేదు, ఇడ్లీ సరిగా ఉడకలేదు. ఎందుకో…… మధ్యాన్నం కూడా సరిగా భోజనం చేయలేదు. రోజంతా అలా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణంలోనే గడిచింది.

తీరా సాయంత్రం ప్రయాణ సమయానికి ఆకలి వేస్తుండటంతో.. IRCTC క్యాంటీన్ కి వెళ్ళాను; క్యాంటీన్ లో ఇడ్లీ అడిగితే లేవన్నారు, దోశ అడిగితే లేట్ అవుతుందన్నారు. పోనీ పెరుగన్నం అయినా ఉందా అంటే అదీ లేదన్నారు. అక్కడ కేవలం మంచూరియా, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చేసేది లేక ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను.

రైలు సమయం దగ్గరపడుతున్నా ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందాను. తీరా పార్సిల్ చేతికిచ్చాక చూస్తే, అక్కడి వాతావరణం, ఆ వంటవాడి నిర్లక్ష్యం నన్ను ఆశ్చర్యానికి, ఆవేదనకు గురిచేశాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన కడాయిలోనే (wok) నా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేయడం నేను స్వయంగా చూశాను. ఇదేంటని ప్రశ్నిస్తే, మొదట నా మాటలు పట్టించుకోని ఆ చెఫ్, ఆ తర్వాత పక్కనే ఉన్న మరో కడాయిని చూపించి "అందులోనే చేశాను" అంటూ నా కళ్ళెదుటే పచ్చి అబద్ధం ఆడాడు. ఆఖరికి క్యాష్ కౌంటర్ వద్ద గట్టిగా అడిగి నా డబ్బు వెనక్కి తీసుకుని, హడావిడిగా వెళ్లి రైలెక్కాను.

రైలు కదులుతున్నా నా మదిలో ప్రశ్నలు ఆగలేదు. అతను ఎందుకు అబద్ధం చెప్పాడు? ఒకవేళ నేను చూడకపోతే నా పరిస్థితి ఏమిటి? శాఖాహారులంటే ఎందుకంత చులకన? ఈ ప్రశ్నల వెనుక దాగి ఉన్నది కేవలం ఒక ఆహారపు అలవాటు కాదు, తోటివారి మనోభావాలను గౌరవించని నేటి సమాజపు తీరు.

నమ్మకం మరియు వృత్తి ధర్మం

ఏ వ్యాపారమైనా వినియోగదారుల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అందులోనూ ఆహార సంబంధిత వ్యాపారంలో ఉన్నవారికి మరింత నైతికత ఉండాలి. కస్టమర్ అడిగిన ఆహారం లేనప్పుడు "లేదు" అని నిర్మొహమాటంగా చెప్పడం ఉత్తమమైన వ్యాపార లక్షణం. అంతేతప్ప, అబద్ధం చెప్పి, మభ్యపెట్టి డబ్బులు తీసుకోవాలనుకోవడం కనీస మానవత్వానికే మచ్చ.

మనోభావాలను గౌరవించడం ఒక కనీస సంస్కారం

ప్రతి మనిషికీ తమదైన జీవనశైలి, నమ్మకాలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. శాఖాహారం తీసుకోవడం అనేది కొందరికి కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, వారి నమ్మకం, వారి సంప్రదాయం.

నిర్లక్ష్యం తగదు: గుడ్డు లేదా మాంసాహారం వండిన పాత్రలో శాఖాహారం వండి ఇవ్వడం వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమే. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, కస్టమర్ నమ్మకానికి చేసే ద్రోహం.


చులకనభావం ఎందుకు?: "ఏదైతే ఏముందిలే" అనే చులకన భావం చాలా ప్రమాదకరం. మనకు చిన్నదిగా, మామూలుగా అనిపించే విషయం మరొకరికి చాలా సున్నితమైనది కావచ్చు. వారి అలవాట్లను తప్పుబట్టే లేదా కించపరిచే హక్కు ఎవరికీ లేదు.

మంచి తనం అంటే ఏంటి?

నిజమైన మంచితనం అంటే మన చుట్టూ ఉన్నవారి ఇష్టాయిష్టాలను, అలవాట్లను అర్థం చేసుకుని, వాటికి తగిన గౌరవం ఇవ్వడం. మన వల్ల ఎదుటివారి మనసు నొచ్చుకోకూడదు అని ఆలోచించడమే ప్రాథమిక సంస్కారం. ఒక చిన్న అబద్ధం లేదా ఒక నిర్లక్ష్యపు చర్య ఎదుటివారి మానసిక ప్రశాంతతను ఎంతగా దెబ్బతీస్తుందో ఆ చెఫ్ గ్రహించలేకపోయాడు.

 బాధ్యత - నిజాయితీ: ఈ ప్రపంచంలో ఎవరి ఇష్టాలు వారివి. ఆ భిన్నత్వాన్ని అర్థం చేసుకుని గౌరవించినప్పుడే సమాజంలో నిజమైన మానవత్వం వెల్లివిరుస్తుంది. ఆ చెఫ్ మారతాడో లేదో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనలు మాత్రం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి: "తోటి మనిషి నమ్మకాలను బాధ్యతగా గౌరవిద్దాం. వ్యాపారంలోనే కాదు, జీవితంలోనూ నిజాయితీగా ఉందాం." 

- టి. మల్లికార్జున ప్రసాద్

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.