కృత్రిమ మేధ అభివృద్ధిని ఆపేయండి.........

 కృత్రిమ మేధ అభివృద్ధిని ఆపేయండి.. మస్క్‌ సహా 1000 మంది నిపుణుల లేఖ

సౌజన్యం: ఈనాడు దినపత్రిక

వెంటనే అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ పలువురు నిపుణులు బహిరంగ లేఖ రాశారు. దీనిపై ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌, యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ సహా 1,000 మందికి పైగా నిపుణులు సంతకం చేశారు.

 వాషింగ్టన్‌: టెక్‌ వర్గాల్లో కృత్రిమ మేధ (Artificial Intelligence) ఎంత ఆసక్తి కలిగిస్తుందో.. అంత ఆందోళనకూ గురిచేస్తోంది. ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్‌లో ఇది మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వంటి టెక్‌ నిపుణులు సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు.

వెంటనే అత్యాధునిక ఏఐ (Artificial Intelligence) వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ పలువురు నిపుణులు బహిరంగ లేఖ రాశారు. దీనిపై ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌, యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ సహా 1,000 మందికి పైగా నిపుణులు సంతకం చేశారు. ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ఇటీవల జీపీటీ-4 పేరిట మరింత అత్యాధునిక ఏఐ వ్యవస్థను పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖను ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తరఫున విడుదల చేశారు. ఈ సంస్థకు ఎలాన్‌ మస్క్‌ నిధులు సమకూరుస్తున్నారు. సంతకం చేసిన వారిలో చాట్‌జీపీటీని విమర్శిస్తున్న ప్రముఖులతో పాటు ఓపెన్‌ఏఐ ప్రత్యర్థి సంస్థల ప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. ఓపెన్‌ఏఐకి తొలినాళ్లలో మస్క్‌ కూడా నిధులు సమకూర్చారు. అలాగే ఆయన నేతృత్వంలో ఉన్న టెస్లా.. తమ విద్యుత్‌ కార్ల కోసం ప్రత్యేక ఏఐ వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తోంది.

మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ-4 వంటి ఏఐ వ్యవస్థలు సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు. జీపీటీ-4 కంటే శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

సౌజన్యం: ఈనాడు దినపత్రిక

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.