చర్చకు మూడు మార్గాలు: వాదం, జల్పం, వితండం - మూడు పర్యవసానాలు

    ప్రతి రోజూ మనం ఎందరితోనో మాట్లాడతాము, ఎన్నో అంశాలపై చర్చలు జరుపుతాము. కానీ, మనం చేసే ఆ చర్చలు...... సంభాషణలు.......
  •  ఎంతమేరకు అర్థవంతంగా ఉంటున్నాయి? 
  • అవి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నాయా? లేక
  • మనోవ్యథను మాత్రమే మిగులుస్తున్నాయా? 
    ప్రాచీన భారతీయ తర్కశాస్త్రం (న్యాయశాస్త్రం) ఈ ప్రశ్నలకు సమాధానంగా, ఒక చర్చ ఎలా ఉండాలనే దానిపై స్పష్టమైన విశ్లేషణను అందిస్తుంది. ఆ విశ్లేషణ ప్రకారం, చర్చ కు మూడు మార్గములు లేదా మూడు ప్రధాన రీతులు ఉన్నాయి. అవే: వాదము, జల్పము, వితండము. వీటి స్వభావం, లక్ష్యం, అంతిమ పర్యవసానం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. వీటిని వివరంగా పరిశీలిద్దాం.

1. వాదము – సత్యాన్వేషణతో కూడిన చర్చ

ఒక చర్చకు నిజమైన ధ్యేయం సత్యాన్ని వెలికితీయడమే అయితే, అది 'వాదము' అనే అంశం కిందకు వస్తుంది. ఇద్దరు వ్యక్తులు - అది రాజకీయాలపైనా, సాహిత్యంపైనా, లేదా ఏదైనా ఒక విషయంపైనా - భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు, 'నిజం ఏమిటో తెలుసుకోవాలి' అనే ఏకైక ఉద్దేశ్యంతో వారు చేసే హేతుబద్ధమైన, క్రమబద్ధమైన చర్చే 'వాదము'.

ఇందులో విజేతను నిర్ణయించడమన్నది ఉండదు. అహంకారం, ఆధిపత్య ప్రదర్శన - ఇవన్నీ ఇక్కడ స్థానం పొందవు. ప్రతి వ్యక్తి తన వాదనను వాస్తవాలతో, తర్కంతో సమర్ధిస్తాడు. ఎదుటివారి వాదనలో బలమైన అంశాలు ఉంటే వాటిని గౌరవిస్తాడు. తన వాదనలో లోపం ఉందని నిరూపితమైతే, దాన్ని వినయంగా, సౌమ్యంగా అంగీకరించడానికి సిద్ధపడతాడు. ఇలాంటి వాదము వల్ల వ్యక్తి యొక్క ఆలోచనా వ్యాప్తి పెరుగుతుంది, సమాజంలో మేధోపరమైన వాతావరణం వికసిస్తుంది.

2. జల్పము - అహంకార ప్రధానమైన చర్చ

'చర్చ కు మూడు అంశములు'లో రెండవది 'జల్పము'. ఇది వాదమునకు పూర్తి విరుద్ధమైనది. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ నిజం తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ఏమాత్రం ఉండదు. మిగిలేది కేవలం "నా మాటే సరైనది, నేనే గెలవాలి" అనే మొండి పట్టుదల, పోటీతత్వం మాత్రమే.

జల్పవాదులు తమ వాదన ఎంత బలహీనంగా ఉన్నా, దానిని వాక్చాతుర్యంతో, కుయుక్తులతో, లేదా ప్రత్యర్థి భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తమకు అనుకూలం లేని వాస్తవాలను వారు విస్మరిస్తారు. తప్పు ఉన్నా దాన్ని ఒప్పుకోకుండా, ఎలాగైనా తమ వైపు ఎక్కువ మంది మద్దతు పొందడానికి ప్రయత్నిస్తారు. దురదృష్టవశాత్తు, నేటి రాజకీయ డిబేట్లు, టెలివిజన్ ప్యానెల్ చర్చలు చాలావరకు ఈ జల్పము కోవలోకే వస్తాయి. దీని ఫలితంగా వాదకులకు, శ్రోతలకు ఎటువంటి జ్ఞానలాభం ఉండకుండా, కేవలం మానసిక అలసట, అశాంతి, ద్వేషం మాత్రమే మిగులుతాయి.

3. వితండము - నిరాధారమైన ఖండన

'చర్చ కు మూడు అంశములు'లో చివరిది, అత్యంత ప్రమాదకరమైనది 'వితండము'. ఇది ఖండన కోసమే ఖండన చేసే వైఖరి. ఒక వ్యక్తికి ఆ విషయంపై సరైన అవగాహన, అధ్యయనం, పట్టు ఏమీ ఉండవు. అయినా, ఎదుటి వ్యక్తి ఏది చెప్పినా, ఎంత హేతుబద్ధంగా చెప్పినా, దానిని గుడ్డిగా వ్యతిరేకించడం, తిరస్కరించడం వీరి స్వభావం.

వితండవాదులు కొత్తగా ఏదైనా ప్రత్యామ్నాయ వాదనను ముందుకు తీసుకురాకుండా, ఇతరుల వాదనను పడగొట్టడంలోనే సంతృప్తి పొందుతారు. వారి ఉద్దేశ్యం చర్చను అభివృద్ధి చేయడం కాదు, దాన్ని అస్తవ్యస్తం చేయడం. నేటి సోషల్ మీడియా యుగంలో, ట్రోలింగ్ సంస్కృతిలో ఇటువంటి వితండవాదాలు విపరీతంగా కనిపిస్తాయి. ఒక మంచి సమాచారాన్ని, ఉపయోగకరమైన సూచనను కూడా కేవలం అవతలి వ్యక్తి ఎవరన్న కారణంతో కాదనడం ఇందులో సర్వసాధారణం. దీనివల్ల సత్యానికి, సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా, సమాజంలో విభేదాలు మరింత లోతవుతాయి.

సరైన అంశాన్ని ఎంచుకోవడం

 చర్చ కు మూడు మార్గాలు గా చెప్పబడే వాదం, జల్పం, వితండంలో మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటామన్నదే అత్యంత కీలకం.

  1. మన చర్చ 'వాదం' రీతిలో ఉంటే, అది మనిషిగా మన పరిణామాన్ని పెంచుతుంది, సమాజంలో మంచి మేధో సంస్కృతికి పునాది అవుతుంది.
  2. మన చర్చ 'జల్పం' వైపు మొగ్గితే, ఆ వాతావరణంలో గెలిచినా, ఓడినా మిగిలేది వ్యథ, చిరాకు, బాంధవ్యాల కోత మాత్రమే.
  3. ఇక 'వితండం' అనే దుష్ప్రవృత్తిని పెంచుకుంటే, ఆ మూర్ఖుల ప్రవర్తన వల్ల మనకు, మన చుట్టూ ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అటువంటి ఆలోచనా విధానం ఉన్నవారి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
అందుకే, మనం ఎవరితో ఏ అంశంపై చర్చించినా, ముందుగా ఆ చర్చ ఏ అంశం (వాదమా, జల్పమా, వితండమా) వైపు నడుస్తుందో గమనించడం అవసరం. సత్యాన్ని, అవగాహనను మాత్రమే లక్ష్యంగా ఉంచుకుని, వినే తాళిమి, ఆలోచించే తెలివి, ఒప్పుకునే ధైర్యం మనలో పెంపొందించుకుంటేనే, ఏ చర్చ అయినా..... సంభాషణ అయినా......   మనకు, సమాజానికి ఉపయోగకరంగా మారుతుంది.
రచన: టి.యం.ప్రసాద్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.